Friday, May 8, 2020

శివ తత్వం

అమ్మా అద్భుతం తల్లీ
నీ అరచేతిలో ఆదమరిచి నిద్రిస్తున్న నన్ను అయ్య ఒడిలో ఎప్పుడు చేర్చావో తల్లీ, ఒక్కసారిగా వెులకువ  వచ్చిందమ్మా... అత్యద్భుతమైన ఆ వెలుగు తరంగంలో నా కళ్ళు ఎంతో విప్పారి చెప్పడానికి అలవికాని ఆనందభరితాలై విశాల సాగరాలయినాయమ్మా... ఎంత ఆనందమమ్మా... అయ్య తల పైన ఆ నెలవంకనందుకోవాలనే ఆశతో నా కనుచూపులు ఎగసిపడే సముద్ర కెరటాల వలే పైపైకే పోతున్నాయి... 

అమ్మా ఎంత ఆశ్చర్యమమ్మా, నీ మెత్తని చేతుల నుండి పర్వత సానువుల కంటే కటువైన అయ్య తొడపైకి చేరినా ఇసుమంతైనా కష్టమనిపించలేదు సరికదా ఎంతో వెచ్చగా నీ పొత్తిళ్లలో వుండే ఆ సౌఖ్యమే అనిపించిoదమ్మా... ఆ స్వామి ఊపిరిలో ఒక లయ ఉందమ్మా, అందులో ఒకసారి చల్లని గాలిలో ఘనీభవించి నాట్య ముద్రలోనున్న శిలగా అనుభూతి చెందితే మరోసారి ఆయన వెచ్చని ఊపిరిలో నా పైనున్న మంచు పలకలు కరిగి చెమటలా ప్రవహిస్తుంటే గంగా ప్రవాహ తరంగాలలో సాన పడుతున్న సాలగ్రామమా నేను అనిపిస్తుందమ్మా...

అమ్మా జ్ఞాన ప్రసూనాంబా. అమాయక పసికందునైన నాకీ అనితర సాధ్యము దుర్ధరమైన ఈ అఖండ సౌభాగ్యము, అనిర్వచమైన ఆనందానుభూతి నీవు కాక మరి ఎవరు అందించగలరు?

అమ్మా, నేను భవబంధాల మాయలో పడి నా చుట్టూ ఒక సాలెపురుగువలే ఒక వల నేర్పరుచుకొన్నాను ... అటు ఇటు ఆ సాలె గూడులో చిక్కుకున్న పురుగుల వెనకాల పరుగులు పెడుతూ ఏమి సాధించానమ్మా? నా ఆ ఆశల గూడులో నేనే ఇరుక్కు పోయానన్న ఎరుక లేక పోయింది...

అమ్మా... నేను నేను అనే మదములో నా అంతటి వారు లేరనే గర్వము లో అదుపు తప్పిన ఏనుగులా ఈ చీకటి ప్రపంచమనే అడవిలో నలుమూలలా తిరిగి అర్ధము లేని పనులలో క్షణికమైన వికృతానందములో మైమరిచి తిరుగుతూ లేవలేని గుంటలో పడి అరచి అరచి సాయ మందక స్పృహ తప్పి తే గానీ నా అవివేకం నాకు తెలియక పోయింది...

అమ్మా... ఇతరులు కట్టిన పుట్టలో నక్కి నా కంటే బలహీనులను చావ కొట్టి నా కంటే బలమైన వారి నుంచి తప్పించుకు తిరుగుతూ ఆ బలము - భయముల కలగలసిన జీవితములో చివరికి విధివశాన నా పడగ పైన మేనంతా కొట్టబడి, శిధిలమైన ఆ శరీరాన్ని చూచినప్పుడు కాని నాకు ఈ జీవన పరమార్థము తెలియదని గ్రహించలేక పోయాను...

అమ్మా జ్ఞాన ప్రసూనాంబా, నీ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు నా పై ప్రసరించినప్పుడు కదా, నా జీవితం అనూహ్య మలుపు తిరిగింది. నా కథ స్వామికి చేరువైంది. థ్యానము, యోగము, జ్ఞానము అన్నీ ఆయనే. ఊపిరే ప్రణవము. దేహమే దేవాలయము. అడుగులన్నీ ఆయన కొరకే. ఆశలన్నీ ఆ శివయ్య కోసమే. ఆలోచనలన్నీ ఆయన నామాలే. 

అదుపు తప్పిన నా జీవన నావకు చుక్కాని నీవైతే ఆవలి ఒడ్డు ఆ శివయ్య ఒడి. నా ఎద్దు బండి జీవితము నీ ఆధీనం చేశాక పథం సుగమం అయింది. గమ్యం కైలాసం. ఈ శిరమే హిమవత్పర్వతం, నాలోని కుండలిని నీవు. గంగ, యమున, సరస్వతులలో మునిగి త్రివేణి సంగమ స్నానాల తరువాత సహస్రార్చన చేసి శివునిలో చేరినప్పటి ఆ అనిర్వచనీయ ఆనందానికి పరిథులేవి? వర్ణనేది? 

అయ్య ఒడే ఆనంద నిలయం. ఆశ్రయథామం. అదే తత్వం. అదే వేదం. అదే వేద్యం. అదే వైద్యం. అదే వేదాంతం. అదే శివం. అదే శంకరం. అదే సుందరం.

1 comment: