Sunday, March 25, 2018

రామాయణ పరమార్ధం

శ్రీరాముడు దాశరధి. అంటే దశరధుని కుమారుడు. దశరధుడు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అనే పది రధాలను ఆరోహించిన ఆత్మ . రాముడు ఆత్మ నుండి ఉద్భవించిన దైవప్రసాదిత శుద్ధ చైతన్యం. సీత ధరణిజ. భూమి పైనున్న కొండలు, చెట్లు, చేమలు, నదులు, చెరువులు. ప్రకృతికి ప్రతీక. రావణుడు అంతా తన ఆధీనం లో ఉంచుకోవాలనుకునే మానవునికి ప్రతినిధి. తన పది తలలను ( ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలతో మేథస్సుని జోడించి) ఎలా ప్రకృతిని తన వశం చేసుకోవాలనుకొనే ఆలోచనలతో తపించే వాడు. ప్రకృతి పై ఆధిపత్యం సాధించే ఈ పోరాటంలో సమస్త జీవరాశులు, రామునితో కూడి,  ఆ రావణుడు నిర్మించుకొన్న ఆ బంగారు లంకను నాశనం చేయడమే రామాయణం. ఇక్కడ లంక అంటే ప్రకృతి లోని జీవరాశులకు దూరంగా నిర్మించుకొన్న జీవన విధానం. అటువంటి లంక నశించక తప్పదు. ప్రకృతిని నియంత్రించాలనే వ్యామోహం వినాశనానికి దారి తీస్తుంది. సీతారామ కళ్యాణం మానవుని శుద్ధ చెైతన్యా‌న్ని ప్రకృతితో జోడించి సమస్త జీవ రాశులతో సమతుల్యంతో సహజీవనం చేయడమే. చెట్లను నాటండి. మిగతా జీవరాశులతో ఆదర పూర్వకంతో మెసలండి. వన్య ప్రాణులను సంరక్షించండి. మీ లోని రామ తత్వానికి (divine consciousness) తల ఒగ్గండి. రామరాజ్యంకి స్వా గతం పలకండి. ప్రకృతిలోని అన్ని జీవులతో శాంతియుత సహజీవనమే రామ రాజ్యం.